సాక్షి, విజయనగరం : భూ సేకరణ, భూ సమీకరణ పేదల కోసం మాత్రమేనని.. టీడీపీలా దోచుకోడానికి కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బాబు ఎప్పుడూ ప్రగల్బాలు పలకడమేనా.. పనిచేయడం ఏమైనా ఉందా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై చురకలంటించారు. బుధవారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టే చంద్రబాబును చిత్తుగా ఓడించి వైఎస్ జగన్ ముఖ్యమత్రిగా గెలిపించారని అన్నారు. ల్యాండ్ పూలింగ్‌పై విశాఖ వస్తానని బాబు ప్రకటించిన విషయం గుర్తు చేశారు. చంద్రబాబు, జిల్లాకు వస్తే టీడీపీ నాయకులు ఎలా దోచుకున్నారో ప్రజలు చెబుతారని తెలిపారు. జిల్లాలో బాబు పర్యటన తర్వాత టీడీపీకి ఉన్న కాస్త గౌరవం, విశ్వాసం కూడా పోవడం ఖాయమన్నారు.
భూ సేకరణలో ప్రజలు అసంతృప్తిగా ఉంటే వీలైతే ఓ రూపాయి ఎక్కువైనా ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందని, ప్రకృతి కూడా బాగా సహకరించి పంటలు సమృద్ధిగా పండినయన్నారు. మళ్లీ వైఎస్ జగన్ పాలనలో సకాలంలో వర్షాలు పడి మంచి ఫలసాయం వచ్చిందని అన్నారు. విజయనగరం జిల్లా ప్రజలు చైతన్య వంతులు కాబట్టే వైఎస్సార్‌సీపీకి 9 సీట్లు కట్టబెట్టారని తెలిపారు.